![]() |
![]() |
(ఆగస్ట్ 21 భూమిక చావ్లా పుట్టినరోజు సందర్భంగా..)
తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో హోమ్లీ నటిగా, నటనకు ప్రాణంపొసే కథానాయికగా చెరగని ముద్ర వేసుకున్న అందాల భామ భూమిక. పంజాబీ కుటుంబంలో జన్మించిన భూమిక, మోడలింగ్ రంగం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత ప్రకటనల్లో మెరిసి వెండితెర ప్రవేశానికి బాటలు వేసుకున్నారు.
అక్కినేని సుమంత్ హీరోగా వచ్చిన 'యువకుడు' చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన భూమిక, తన మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'ఖుషి' చిత్రం ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా, భూమికను స్టార్ హీరోయిన్గా నిలబెట్టింది.
ఆ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన చేసిన 'ఒక్కడు', యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన 'సింహాద్రి' చిత్రాలు కూడా రికార్డు స్థాయి విజయాలు సాధించడంతో భూమిక టాలీవుడ్లో తిరుగులేని లక్కీ హీరోయిన్గా మారిపోయారు. 'వాసు', 'మిస్సమ్మ', 'అనసూయ' వంటి చిత్రాలలో నటించి గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన భూమిక, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన 'తేరే నామ్' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటికీ, తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ 'ఎంసిఎ', 'సిటీమార్', 'సీతారామం' వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు.
Bhumika Chawla Birthday, Bhumika Chawla Movies, Kushi Bhumika Chawla, Okkadu Bhumika, Bhumika Chawla Special Story
![]() |
![]() |